Friday, 25 April 2014

దేవుని ప్రేమ

                                   .....................................దేవుని ప్రేమ..........................
                                                   
                                                         సాధు సుందర్ సింగ్ గారి రచన

 దేవుడు ప్రేమకు మూలం. అంతరిక్షములో గ్రహములు ఆకర్షణ శక్తి, ప్రభావమును బట్టి భద్రముగా ఉన్నవి. ఆ ప్రకారం దేవుడు ప్రేమ అను ఆత్మీయ ఆకర్షణ శక్తి ద్వారా సమస్తము చక్కపెట్టుచున్నాడు. అయస్కాంతము ఉక్కును ఆకర్షించుటకు కారణం ఏంటి.?  కేవలము  ఉక్కులోని ఆకర్షణ శక్తి. ఉక్కు బంగారమును ఆకర్షించడం లేదు. బంగారం మరింత విలువైనది కాని అందులో అయస్కాంతం యెడల ఆకర్షణ శక్తి లేదు.
               ఆ ప్రకారమే దేవుడు ఎంతో ఘోరపాపినైనా ఆకర్షించుచున్నాడు. వారు పశ్చాతాపపడి ఆయన వై పు ఆకర్షితులవుతున్నారు. స్వనీతిని బట్టి ఇతరులు ఆయన ప్రేమకు ఆకర్షతులగుటలేదు. ప్రేమ గల తల్లి తన బిడ్డకు ముద్దు పెట్టుచున్నది. అది బిడ్డ యెడల గల తల్లి ప్రేమను సూచించుచున్నది. అయితే బిడ్డకు అంటురోగం  ఉంటే తల్లి ముద్దు పెట్టుట మానవచ్చుగాని బాధపడుతున్న బిడ్డ పట్ల తల్లి ప్రేమ తక్కువ కాదు. అది ఎక్కువ అవుతుంది. కారణం జబ్బు పడిన బిడ్డలకు ఎక్కువ పరామర్శ, ప్రేమ అవసరం కనుక.
           పాపమనెడి అంటురోగమునకు బలియైన వారిని ప్రభువు బాహ్యముగా విడిచిపెట్టినట్లు కనబడినా... వారి యెడల ఆయన ప్రేమ మితిలేని ప్రేమగా తల్లి తన బిడ్డ పట్ల ఉండే ప్రేమ కంటే ఎక్కువగా ఉంది. ( యెషయా 49:15)
దేవుని గుణగణములలో అతి శ్రేష్టమైనది  ఓరిమి. అది అంతులేనిది. కొంత నీరు నింపిన పాత్రను పొయ్యి మీద పెట్టిన క కొంత సేపటికి నీళ్లు పొంగిపోవులాగా.. కొంత మంది మనుష్యులు కోపముతో పొంగిపోవుట జరుగుతుంది. అయితే దేవుడు అలా కోపముతో పొంగిపోవడం లేదు.  ఆయన అలాగు ఉగ్రత చూపి ఉంటే ప్రపంచం చాలా కాలము క్రిందే పూర్తిగా లయమైపోయి ఉండేది.
                ఒక వ్యక్తిని ప్రేమించుచున్న ఇద్దరి వ్యక్తుల మధ్య అసూయ పుట్టుచున్నది. గనుక వారు బద్ద శత్రువులు  అవుతున్నారు. అయితే దేవుని ప్రేమించు వారి మధ్య  అటువంటివి జరగవు. దేవుని ప్రేమించు వ్యక్తి ఇతరులను ప్రేమించుటను బట్టి అసూయ పడే గుణం లేదు. అంతే కాదు వారు దేవుని ప్రేమించని పక్షమున అతడు ఆవేదన చెందును. మనుష్యులు మనుష్యులను ప్రేమించుట - మనుష్యులు దేవుని ప్రేమించుటకు మధ్య గల వ్యత్యాసం దేవుని మితి లేని ప్రేమ. తన్ను ప్రేమించు వారందరి పట్ల ఒక వ్యక్తి సమానమైన ప్రేమ చూపించలేరు. కారణం అతనికున్న ప్రేమ శక్తి పరిమితం. అయితే దేవుని ప్రేమించు శక్తి అపరిమితమైంది గనుక అందరినీ  ఆయన సమానంగా ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమ చాలినంత ప్రేమ........
     క్రీస్తు మనయందు జీవించుచున్నాడు. మన జీవితమంతయు ఆయన వలె మార్చబడుచున్నది. ఉప్పును నీటిలో వేయుచున్నాము. అది సంపూర్ణముగా కరిగిపోవుచున్నది. మనం వేసిన ఉప్పు కనబడకపోయినా ఆ నీటిని రుచించుట ద్వారా మనం నీటిలో వేసిన ఉప్పు అక్కడే ఉందని గ్రహించగలం. ఆ ప్రకారమే ఆత్మస్వరూపిగా మన యందు ఆయన నివసించు క్రీస్తు అదృశ్యుడై ఉన్నాడు. ఆయన మనకు ప్రసాదించిన ప్రేమను బట్టి ఇతరులు మనలోని క్రీస్తును గుర్తించగలరు.
                       దేవుడు తన ఉన్నతమైన  ప్రేమను మనకు అనుగ్రహించును గాక.
                                                            ఆమెన్

Thursday, 24 April 2014

                    ......................... శరీరధారిగా దేవుడు............................

                                              సాధు సుందర్ సింగ్ గారి  రచన


దేవుడు అనే పదమును ఒక పిల్లవాడు ఉచ్చరించ వచ్చును గాని దాని వెనుక దాగియున్న సత్యమును గూర్చి ఎంత మాత్రం ఆలోచించకపోవచ్చును. అయితే అతడు ఎదిగి తర్వాత అతని మనస్సు పరిపక్వమయ్యే కొలది,  ఆ పదము గూర్చి ఆలోచించడానికి, అవగాహన చేసుకోనుటకు మొదలు పెడతారు.
 అలాగే  ఆత్మీయ జీవితములో అడుగుపెట్టిన వ్యక్తి ఉన్నాడు. అతడు విద్యావంతుడైనప్పటికీ  "క్రీస్తు ఒక నరవాతారము. ఒక గొప్ప మనిషి. ఒక ప్రవక్త "  అని తలంచవచ్చును. అంతకంటే మరెక్కువగా అతడు అంచనా వేయకపోవచ్చును. అయితే అతడు అంతకంతక ఆత్మీయ అనుభవము ఎదిగిన కొలది ఆయన ప్రసన్నతను అనుభవించిన కొలది క్రీస్తు దేవుని శరీర ప్రత్యక్షత అని గ్రహించగలడు. "  దైవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తు నందు   నివసించుచున్నది "  ( కొలస్సీ 2:9)
" ఆయనలో జీవముండేను. ఆ జీవము మనుష్యులకు వెలుగైయుండెను" ( యోహాను 1:4) అను వాస్తవమును గుర్తించును.
                 ఒకడు తన వ్యక్తిత్వమునకు సంబంధించిన విషయములను వ్యక్తపరచుటకు ఎంత క్రొత్త పదజాలము ప్రయోగించినను, గుర్తులు మరియు సాదృశ్యాలను ఉదహరించినను సంతృప్తికరమైన భావాలను అందించజాలదు. వ్యక్తిత్వమునకు కారణమైన ప్రాణాత్మ, యొక్క గుణగణములను మరియు శక్తిని శరీరము స్పష్టముగా తెలియజేయలేకపోతోంది. మరో మాటలో చెప్పాలంటే, ఈ లోకములో జీవించినంత కాలం మానవుని వ్యక్తిత్వం కొంత మట్టుకే వ్యక్తం చేయబడుతుంది. ఎక్కువ భాగం మరుగైయుంటుంది. కేవలము ఆత్మ సంబంధమైన లోక మందు మాత్రము, బాహ్య మరియు అంతరంగ స్థితిగతులు అతని  అవసరతలను తీర్చి అభివృద్ధికి తోడ్పడినప్పుడే అత్మ సంబంధి తన్ను తాను  సంపూర్ణముగా వ్యక్తపరచుట అసాధ్యము.
        నిజముగా మానవుని ఆత్మ విషయం ఇలాగన్నప్పుడు, నిత్యవాక్యము తన దేవత్వమును ఒక శరీరము ద్వారా వ్యక్తపరచుట ఎంత అసాధ్యమో ఆలోచించండి. దేవుడు చాలా మట్టుకు మానవుని రక్షణకు అవసరమైనంత వరకు తన్ను తాను బయలుపరిచెను. అయితే  ఆయన అసలైన మహిమ పరలోకమందు మాత్రమే సంపూర్ణముగా  ప్రత్యక్షమగును.
         కన్నులారా చూడకుండను, సంపూర్ణముగా గ్రహింపకుండను వాస్తవమును ఎలాగు నమ్మగలం..? అనే ప్రశ్న మనలో పుట్టుట సహజమే. ఇక్కడ ఒక ముఖ్యాంశమును చెప్పగోరుచున్నాను. మనము వాస్తవమును నమ్ముటకు వాస్తవమును గూర్చిన సంపూర్ణ జ్ఞానము అవసరం లేదు.
  ఉదా - మన శరీరములో కొన్ని అవయవముల మీద..మన ప్రాణము ఆధారపడుచున్నది. అయితే అవి కన్నులకు కనబడుట లేదు. అవి మరుగై యున్నవి ఎవ్వరూ కూడా తన సొంత మెదడును, గుండెను చూడలేదు. అయినను అవి నాకు లేవని అతడు చెప్పజాలడు. మరంత ఎక్కువ మన ప్రాణము ఆధారపడు మన సొంత మెదడు, గుండెలను మనం చూడలేకపోయిన యెడల మన  మెదడును, గుండెను సృష్టించిన సృష్టికర్తను చూచుట ఎంత కష్టతరమో చూడండి.
                       

                                     దేవుడు దీవించును గాక.............. ఆమెన్ 

Wednesday, 23 April 2014

                                               సృష్టి.... దేవుని ఉద్దేశము....
 ఆదియందు వాక్యముండెను. వాక్యము దేవుని యొద్ద ఉండెను. వాక్యము దైవుడై యుండెన. సమస్తము ఆయన మూలముగా కలిగేను. కలిగియున్న దేదియు ఆయన లేకుండా కలుగలేదు . ( యోహాను 1: 1-3)

 విశ్వమంతయు సృజింపబడక ముందే ఎన్నో కాలాలకు పూర్వమే దేవుడు వాక్యమై యుండెను. వాక్యము  అనగా మూల భాషలో లోగోస్ అని అర్థం. ఆయన ద్వారానే జీవము గలవి.. జీవము లేనివి రాసులుగా బయలు వెళ్లాయి. జీవము లేనివి తామంతట తామే బయలు వెలడుట అసాధ్యం. అంత మాత్రమే కాక, అవి జీవమున్న వాటిని ఉత్పత్తి చేయుటయు అసాధ్యము. కారణం జీవము కలిగి ఉన్నదే జీవమును ఉత్పత్తి చేస్తుంది. ఆ జీవానికి ఆధారభూతుడు మూల కారకుడు దేవుడు.

సృజనాత్మక శక్తితో దేవుడు నిర్జీవమైన వాటినన్నింటిని ఉత్పత్తి చేసి వాటికి జీవము పోసెను. సృజించిన వాటన్నిటిలో మిన్నయైన మానవుని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయెను. ( ఆదికాండము 2:7)
 దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను (ఆది 1:27), సమస్త భూమిని ఏలుటకు  అధికారము అనుగ్రహించెను. (ఆది 1:28)
   సృష్టించుటలో దేవుని ఉద్దేశము తనలోని వెలితిని పూర్తి చేసుకోవడానికి కాదు, ఎందుకనగా తనలో తాను పరిపూర్ణుడై యున్నాడు. సృష్టించుట ఆయన స్వభావము గనుక ఆయన సృష్టింపసాగెను. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదీ చేయలేదు. ( 2 తిమోతి 2:13) జీవాన్ని ప్రసాదించుట అనునది ఆయనలో ఉన్న ప్రాణ త్యాగం చేసే శక్తికి తార్కాణము. తన సృష్టిలో మానవకోటినంతటిని సుఖింపజేసి తన ప్రాణము సహితము త్యాగం చేసే అటువంటి ప్రసన్నత ద్వారా నిజమైన సుఖ సంతోషాలను ప్రాప్తింపజేయాలన్నదే ఆయన ప్రేమకు నిదర్షనం.
   సృష్టిలో పొందెడి  ఆనందానికి అవధులున్నాయి. దేవుడు మాత్రమే మానవ హృదయులందలి అవసరతలు ఎరిగి పరిపూర్ణతలో వారిని సంతృప్తి గలవారుగా చేయగలరు. అటువంటి సంతోషము లేని మనుష్యులు, తమ అజ్ఞానము మరియు అవిధేయతను బట్టి దేవునికి విరోధముగా తిరుగుబాటు చేయు వారై ఉన్నారు. 
  దృశ్యమైన, అదృశ్యమైన లోకమందలి సృష్టి జాలమును లెక్కించలేము. వాటి ద్వారా దేవుని లెక్కింపలేని గుణగణములు బయలు పరుచుచున్నవి. ప్రతి జాతి, దాని శక్తి  కొలది దేవుని స్వభావమును ప్రతిబింబింపజేయుచున్నది. పాపుల ద్వారాను దేవుడు తన తండ్రి ప్రేమను బయలుపరుచుచున్నారు. వారు మారుమనస్సు పొందుటకును,శాంతి సమాధానము మరియు సంతోషముతో కూడిన నిత్యజీవమును పొందుకొనుటకును ఒక అవకాశమును ఇచ్చుచున్నాడు.

                                      జ్ఞాని సాధుసుందర్ సింగ్...ప్రసంగ పాఠము

Monday, 21 April 2014

                                     అపోస్థులుడైన పేతురు        
 అపోస్తులుడైన పేతురు యేసు క్రీస్తుకు శిష్యుడు. చేపలు పట్టేవాడు. యేసు క్రీస్తుతో పాటు పరిచర్యలో పాల్గొన్నారు. చదువు సంధ్యలు లేని వాడు. యేసు ప్రభువు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన శిష్యులలో ఏవరైనా ఉన్నారంటే అది పేతురు గారే. ఆయన రూపాంతరం చేందే సమయంలోను, నీటిపై నడిచే సమయంలోను, పేతురు అత్తకు జ్వరం వస్తే యేసు క్రీస్తు వారు స్వస్థపరచడం, గెత్సెమెనే తోటలో యేసూ క్రీస్తు ఏకాంతంగా ప్రార్థన చేసేటప్పుడు పేతురు, యాకోబు, యోహానులను వెంటబెట్టుకుని ప్రార్థన చేసినట్లు మనం బైబిల్ లో చూస్తాం. మూడు సార్లు నన్ను ఎరుగవని చెప్తావని పేతరు గూర్చి క్రీస్తు వారు ప్రవచనం చెప్పారు. అది నెరవేరడం మనం బైబిల్ లో గమనిస్తాం. ఇలా ప్రతీ సందర్భంలోను పేతురుకు యేసు క్రీస్తు వారు ప్రాధాన్యత ఇచ్చినట్లు మనం బైబిల్ లో చూడవచ్చు. యేసుక్రీస్తు వారు ఆరోహణ అనంతరం క్రైస్తవ సంఘ కాపరి బాద్యతలు పేతురు గార్కి అప్పగించారు.తన గొర్రెలను మేపుము, కాయుము అను ప్రభువు సంఘం యెక్క బాధ్యతలు పేతురుకు అప్పగించారు. పాతాళ ద్వారాలు ఈ సంఘం ఎదుట నిలువనేరవని క్రీస్తు వారు చెప్పారు. ఆ తర్వాత పెతురు క్రైస్తవ సంఘానికి పునాది వేశారు. ఎక్కువగా పెతురు గారు యూదయ దేశంలో యూదుల మధ్య క్రీస్తు సువార్తను ప్రకటించారు.

                      .................... పేతురుకు సంబంధించిన విశేషాలు..........


పేతురును యేసు ప్రభువు నీవు యోహాను కుమారుడవైన సీమోను నీవు కేఫా అనబడదువు అని చెప్పారు. కేఫా అనగా రాయి అని అర్థం ( యోహాను 1:42).

కపెర్నహోము గలలియలోని ప్రదేశం. కాన్ స్టాంటైన్ మరణంనకు ముందు క్రీ.శ 337లో ఒక శాసనం కనుగొనబడింది. దానిలో కఫల్ -నహూము నందు పేతురు నివసించిన గృహము ప్రాంతంలో ఒక దేవాలయం కట్టడానికి అనుమతి ఇచ్చారు.ఇది క్రీ.శ 352వ సంవత్సరం తర్వాత కట్టబడినట్లు చారిత్రాత్మక ఆధారాలున్నాయి. ఈ సమాచారం ఎఫిఫానిస్ తన గ్రంధములో రాశారు. అనాటి కట్టడాలలో ఈ దేవాలయం బహు సుందరమైనది. యేసు ప్రభువు మొదటి నుండి కపెర్నహోముకు వెళ్లినప్పుడల్లా సీమోను, ఆంద్రేయ ఇంటికి వెళ్లేవారని తెలుస్తోంది. అక్కడే బస చేసినట్లు ( మార్కు 1:35) తెలుస్తోంది .  అక్కడే అనేక మంది రోగులులను స్వస్థపరిచినట్లు అర్థమవుతోంది. క్రైస్తవ చరిత్రలో పేతురు స్థానం అద్వితీయమైనది. యూదుల మధ్య పేతురు క్రైస్తవ పునాది వేయగా..  అన్యజనుల మధ్య అపోస్థులడైన పౌలు పునాది వేశారు. అపోస్తలుల కార్యములో   పేతురుకు అద్వితీయమైన స్థానం ఇవ్వబడింది. మొదటి భాగమంతా పేతురు గూర్చి..రెండవ భాగంలో పౌలు గూర్చి రాశారు. ఇస్కరియోతు స్థానంలో మరో శిష్యుడ్ని ఎంపిక చేయడంలోను పేతురు ముందు ఉన్నారు. క్రీస్తు అనుగ్రహించిన స్వస్థతా వరంతో శృంగారమనబడిన దేవాలయం వద్ద కుంటివాన్ని బాగు చేసినట్లు అపోస్తులల కార్యకములలో చూడగలం. అననీయ,సప్పీర వంటి వారి విషయంలో కఠినంగా వ్యవహరించి ఆ నాటి సంఘంలో క్రమశిక్షణా చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. సీమోను అనే మాంత్రికుడ్ని గద్దించారు. పేతురు నీడ సైతం స్వస్థత కలుగజేసిందంటే ఆయనలో దేవుని ప్రభావం ఎలా ఉందో అర్థం చేసుకోగలం. లుద్దలో, యొప్పేలో, జార్జియాలో పేతురు సువార్త ప్రకటించారు. అన్యుడైన కొర్నెలికి.. ఆయన కుటుంబానికి బాప్తీస్మం ఇచ్చారు. తొలుత అన్యజనులకు సువార్త ప్రకటించే విషయంలో పౌలుకు, పేతురుకు మధ్య  కొంత విబేధాలు వచ్చినా...పరిశుద్ధాత్ముడు వారిని సరి చేశారు. చివరలో పౌలు, పేతురు ఇరువురు కొరింథు సంఘంలో ఒకరి కొకరు సేవ చేసినట్లు తెలుస్తోంది.
                                                    పేతురు సేవ.
 చరిత్రకారుడైన యోసుబియస్, ఇగ్నేసియస్ల ద్వారా అంతియోకయలో పేతురు సేవ చేసినట్లు చరిత్ర చెబుతోంది. యోసుబియస్ చెప్పినట్లు పేతురు వ్రాసిన మొదటి పత్రిక పొంతు, దాని పరిసర ప్రాంతాలు అయిన బితూనియ, కప్పదొకియ, గలతీయలో వారి పరిచర్య సాగినట్లు తెలుస్తోంది.
                                                       తొలి బిషప్పు
 పేతురు క్రీ.శ  30 నుంచి 40 వరకు అంతియోక దేవాలయమునకు మొదటి బిషప్పుగా వ్యవహరించినట్లు చరిత్ర చెబుతోంది. పేతురు సువార్త నిమిత్తం తూర్పు ప్రాంతానికి వెళ్లిన సమయంలో ఇయోడియస్ కు సేవా బాధ్యతలు అప్పగించారని చరిత్రకారుల ద్వారా వెల్లడవుతోంది. క్రీ.శ 44 వరకు పేతురు రోమాలో పరిచర్య చేయలేదని యోసుబియస్  ఆధారంగా తెలుస్తోంది. పేతురు రోమీయులకు  రాసిన పత్రిక బబులోను నుండి వెలువడిందని సమాచారం. అయితే పౌలు రోమా పత్రిక రాశాక పేతురు అక్కడికి వెళ్లినట్లు చారిత్రాత్మక ఆధారాలున్నాయి. పౌలు గారు ఎఫెసీయులకు రాసిన తొలి పత్రికలోనే పేతురు గారి ప్రస్తావన కనబడుతుంది. పేతురు అక్కడ కొంత కాలం సువార్త ప్రకటించారు. ఆ సమయంలో పేతురు తన భార్యను వెంటబెట్టుకుని వెళ్లినట్లు తెలుస్తోంది. యోరుషలేములో పేతురు పరిచర్య చేసే సమయంలో రెండు సార్లు జెలు శిక్షను అనుభవించారు. ఆ తర్వాత లోకమంతా  తిరిగి పరిచర్య చేయాలని నిర్ణయించుకున్నట్లు అర్థమవుతోంది.
                                                        పేతురు పరిచర్య
 పేతురు తన పరిచర్య కాలంలో బ్రిటన్, గాలు ప్రాంతాల్లో ఉన్నట్లు అనే  రుజువులున్నాయి. రోమాలో నీరో సర్కసు అను ప్రాంతంలో అరెస్టు చేసి ఆయన్ను సిలువు వేయకమునుపే బ్రిటన్ యాత్రను ముగించినట్లు ఆధారాలున్నాయి.
                                                         రోమ్ లో..... పేతురు
 పేతురు రోమాలో మరణించారు. ఎడార్ఫ్ హార్నిస్ కథనం ప్రకారం పేతురు రోమాలో లేడు అనుట సరి కాదు. హెచ్.లేజ్ మన్ క్రీ.శ 170 సంవత్సరంలో అక్కడ కనిపించిన రెండు  జంట సమాధులు ఇద్దరు అపోస్తులవి అని ..పేతురు, పౌలు సమాధులేనని ధృవీకరించారు. వారు ఇద్దరు హతసాక్షులయ్యారు. యోహాను సువార్త ముగింపులోను పేతురు మరణ వార్త రూఢీ అవుతోంది. జోవేల్ లును ప్రకారం మామెర్ టైన్ అను ప్రాంతంలో దుర్గంథముతో కూడిన జైలులో పేతురును బంధించారు.ఆ జైలులో ఆయన్ను ఓ స్తంభానికి కట్టివేసి వెలుతురు లేకుండా తొమ్మిది నెలలు బంధించారు. రోమా చరిత్రలో 3వేల సంవత్సరాల పూర్వం ఇలాంటి కఠినమైన శిక్షను అమలు చేసినట్లు రుజువులున్నాయి. ఈ శిక్షను తర్వాత పేతురు గారికి అమలు చేశారు. ఇదే శిక్షను ఆతర్వాత భక్తిపురలైన అనేక మంది క్రైస్తవులకు అమలు పర్చారు.ఆ జైలులో చీకటి గదిని, గొలుసులతో  చూరునకు కట్టిన ఆ స్తంభమును నేటికీ చూడవచ్చు.
                                       మెమోరిటైమ్..లో...టులియన్ చెరసాల ... శిక్ష భయంకరం
 ప్రాచీన భాషలో  దీన్ని జెమోనియమ్ లేక టుర్లియన్ కీప్ అనే వారు. తరువాత ఇది మెమోరిటైమ్ గా పిలిచారు. ఈ జైలు భూమిపైన తొలచబడిన ఒక మార్గము కలిగి... ఒకే రాయి నుండి రెండు భాగాలుగా భూమిలోకి  మలచబడింది. పై మార్గం తప్ప లోనికి ప్రవేశించుటకు మరే మార్గం ఉండదు. దీని క్రింది అరలో మరణ శిక్షను ఎదుర్కొనే వారిని పడవేస్తారు. దీంట్లోకి వెలుతురు రాదు. ఎవరూ శుభ్రం చేసే వారు ఉండరు. దీని వల్ల ఆ ప్రాంతం అంతా ధుర్గంధమయంగా ఉంటుంది. విషవాయువులు జనిస్తాయి. ఇది చాలా భయంకరమైన మురికి కూపం. ఆ శిక్ష భయంకరం . క్రీ.శ 50లో సాట్లుస్ఈ విధంగా వివరించారు. దీన్ని టులియన్ చెరసాల అని కూడా అంటారు. ఈ జైలు పైకప్పు ఒక రాతితో మలచబడింది. ఆ ద్వారం నుండి 101 అడుగుల లోపలి వరకు ఒక స్తంభంనకు కట్టిన.... స్తంభంగా లోపలి వరకు వెళుతుంది. దీన్ని నిలబెట్టుటకు స్థలం ఉంది. దాని క్రింద అర చనిపోయే వారి కోసం ఏర్పాటు చేసింది. ఆ భాగం అంతా చీకటి మయం, ధుర్గంధభరితం. 100 సంవత్సరాల తర్వాత పేతురును ఇందులో బందీ చేశారు.
                                               చరిత్రలో....
 జూలియస్ సీజర్ కాలంలో జుగుర్ త అనే ఓ ప్రముఖుడ్ని కొన్ని రోజులు అన్నపానాలు లేక పాతర వేసినంత లోతుకు దించి దిశమొలతో బందీగా ఉంచారు. అతడు కొద్ది కాలంలోనే ఆ భయంకరమైన బాధ తట్టుకోలేక మానసిక రోగిగామారాడు. ఇటువంటి భయంకరమైన జైలులో అనేక మంది క్రైస్తవులను రోమీయులు చంపారు.ఇలాంటి జైలులో 9 నెలలు పేతురు ఉంచబడ్డారు. అయినా ఆత్మబలముతో ఆయన బ్రతకడం ఓ అద్భుతమే. ఆయన్ను అలసట తీర్చుకోలేని విధంగా ఒక స్తంభంనకు గోలుసులతో బంధించి నిట్టనిలువుగా కట్టి రాతి తొలిచిన మార్గం ద్వారా గుహాలో దించారు. ఆయినా పేతురు మొక్కవోని ధైర్యంతో క్రీస్తు ప్రేమతో తట్టుకున్నారు. జైలు నందలి 47 మంది పేతురును చూసి క్రైస్తవులుగా మారారు. రాయి అనే పేతురును రోమనులు షీయాండిస్ అనే పద్ధతిలో తలక్రిందులుగా సిలువ వేసి చంపారు. క్రీ.శ 67లో నీరు చక్రవర్తి  పేతురను సిలువవేయాలని ఆదేశించారు. నేను యేసు ప్రభువంతటి వాడను కానని పేతురు చెప్పి తన్ను తలక్రిందులుగా వేయమని కోరారు. రోమా అదికారులు ఆయన ప్రార్థన విని అందుకు సమ్మతించారు.
                                                 చివరిగా.........
ప్రియ సహోదరుడా...పేతురును యేసయ్య పిలిచినప్పుడు తనకు జీవనాధారం అయిన చేపలు పట్టేవ వృత్తిని.  కష్టపడిన సొమ్ముతో కొనుక్కున్న వలలను విడిచి పెట్టి ఆయన్ను వెంబడించారు. ఆలా మొదలయిన ఆయన ప్రయాణంలో చివరకు తన ప్రాణాన్ని భరింపజాలని శిక్ష ద్వారా క్రీస్తుకు సమర్పించుకున్నారు. మరి నీ పరిస్థితి ఏంటి. ఆది అపోస్తులుల కాలంలో ప్రాణాలను క్రీస్తు కోసం ధారపోశారు.  మరి నీవేమి క్రీస్తు కోసం సమర్పిస్తున్నావు. నీ జీవితాన్ని ఎందుకు ఆయన కోసం వెచ్చించడం లేదు. నక్కలకు బొరియలున్నాయి... ఆకాశ పక్షులకు గూళ్లున్నాయి....మనష్యు కుమారుడికి తలవాల్చేందుకు స్థలం లేదని యేసయ్య రోదిస్తున్నారు. నా ప్రియుడా... నీవు యేసయ్యను నీ హృదంయంలోకి ఆహ్వానిస్తావా.... ఆయన నీ హృదంయ వద్ద నిలబడి ఉన్నారు. నీవు తలుపు తీస్తే నీ తో కలిసి భోజనం చేయాలని ఆశపడుతున్నారు.  పేతురు సమర్పించుకున్నట్లు నీవు నీ జీవితాన్ని అర్పిస్తే... పేతురులాగా నీ ప్రాణాలు ఇచ్చే పరిస్థితి రాదు కాని..నీ జీవితం మారుతుంది. అదే మరణం నుంచి ఆయన నిన్ను తప్పిస్తారు. ఇంకా ఎందుకు ఆలస్యం. నీ హృదయాన్ని ఆయనకు అప్పగించు. నీ పాపాల నిమిత్తం క్రీస్తు సిలువ  వద్ద రోదించు. పశ్చాతాపం చెందు.ఇప్పుడే ఆయన నీ హృదయంలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు.
 దేవుడు దీవించుచు గాక.............
ఆమెన్...............................

 

Thursday, 3 April 2014

CLICK FOR ONLINE TELUGU BIBLE

clik for online bible http://onlinetelugubible.net/ http://telugubible.wordpress.com/ http://oldtelugubible.wordpress.com/

Wednesday, 2 April 2014

కల్వరిలో మన కొరకు ప్రాణమిచ్చిన యేసయ్య ప్రేమను పంచేదే ఈ బ్లాగ్