Friday, 25 April 2014

దేవుని ప్రేమ

                                   .....................................దేవుని ప్రేమ..........................
                                                   
                                                         సాధు సుందర్ సింగ్ గారి రచన

 దేవుడు ప్రేమకు మూలం. అంతరిక్షములో గ్రహములు ఆకర్షణ శక్తి, ప్రభావమును బట్టి భద్రముగా ఉన్నవి. ఆ ప్రకారం దేవుడు ప్రేమ అను ఆత్మీయ ఆకర్షణ శక్తి ద్వారా సమస్తము చక్కపెట్టుచున్నాడు. అయస్కాంతము ఉక్కును ఆకర్షించుటకు కారణం ఏంటి.?  కేవలము  ఉక్కులోని ఆకర్షణ శక్తి. ఉక్కు బంగారమును ఆకర్షించడం లేదు. బంగారం మరింత విలువైనది కాని అందులో అయస్కాంతం యెడల ఆకర్షణ శక్తి లేదు.
               ఆ ప్రకారమే దేవుడు ఎంతో ఘోరపాపినైనా ఆకర్షించుచున్నాడు. వారు పశ్చాతాపపడి ఆయన వై పు ఆకర్షితులవుతున్నారు. స్వనీతిని బట్టి ఇతరులు ఆయన ప్రేమకు ఆకర్షతులగుటలేదు. ప్రేమ గల తల్లి తన బిడ్డకు ముద్దు పెట్టుచున్నది. అది బిడ్డ యెడల గల తల్లి ప్రేమను సూచించుచున్నది. అయితే బిడ్డకు అంటురోగం  ఉంటే తల్లి ముద్దు పెట్టుట మానవచ్చుగాని బాధపడుతున్న బిడ్డ పట్ల తల్లి ప్రేమ తక్కువ కాదు. అది ఎక్కువ అవుతుంది. కారణం జబ్బు పడిన బిడ్డలకు ఎక్కువ పరామర్శ, ప్రేమ అవసరం కనుక.
           పాపమనెడి అంటురోగమునకు బలియైన వారిని ప్రభువు బాహ్యముగా విడిచిపెట్టినట్లు కనబడినా... వారి యెడల ఆయన ప్రేమ మితిలేని ప్రేమగా తల్లి తన బిడ్డ పట్ల ఉండే ప్రేమ కంటే ఎక్కువగా ఉంది. ( యెషయా 49:15)
దేవుని గుణగణములలో అతి శ్రేష్టమైనది  ఓరిమి. అది అంతులేనిది. కొంత నీరు నింపిన పాత్రను పొయ్యి మీద పెట్టిన క కొంత సేపటికి నీళ్లు పొంగిపోవులాగా.. కొంత మంది మనుష్యులు కోపముతో పొంగిపోవుట జరుగుతుంది. అయితే దేవుడు అలా కోపముతో పొంగిపోవడం లేదు.  ఆయన అలాగు ఉగ్రత చూపి ఉంటే ప్రపంచం చాలా కాలము క్రిందే పూర్తిగా లయమైపోయి ఉండేది.
                ఒక వ్యక్తిని ప్రేమించుచున్న ఇద్దరి వ్యక్తుల మధ్య అసూయ పుట్టుచున్నది. గనుక వారు బద్ద శత్రువులు  అవుతున్నారు. అయితే దేవుని ప్రేమించు వారి మధ్య  అటువంటివి జరగవు. దేవుని ప్రేమించు వ్యక్తి ఇతరులను ప్రేమించుటను బట్టి అసూయ పడే గుణం లేదు. అంతే కాదు వారు దేవుని ప్రేమించని పక్షమున అతడు ఆవేదన చెందును. మనుష్యులు మనుష్యులను ప్రేమించుట - మనుష్యులు దేవుని ప్రేమించుటకు మధ్య గల వ్యత్యాసం దేవుని మితి లేని ప్రేమ. తన్ను ప్రేమించు వారందరి పట్ల ఒక వ్యక్తి సమానమైన ప్రేమ చూపించలేరు. కారణం అతనికున్న ప్రేమ శక్తి పరిమితం. అయితే దేవుని ప్రేమించు శక్తి అపరిమితమైంది గనుక అందరినీ  ఆయన సమానంగా ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమ చాలినంత ప్రేమ........
     క్రీస్తు మనయందు జీవించుచున్నాడు. మన జీవితమంతయు ఆయన వలె మార్చబడుచున్నది. ఉప్పును నీటిలో వేయుచున్నాము. అది సంపూర్ణముగా కరిగిపోవుచున్నది. మనం వేసిన ఉప్పు కనబడకపోయినా ఆ నీటిని రుచించుట ద్వారా మనం నీటిలో వేసిన ఉప్పు అక్కడే ఉందని గ్రహించగలం. ఆ ప్రకారమే ఆత్మస్వరూపిగా మన యందు ఆయన నివసించు క్రీస్తు అదృశ్యుడై ఉన్నాడు. ఆయన మనకు ప్రసాదించిన ప్రేమను బట్టి ఇతరులు మనలోని క్రీస్తును గుర్తించగలరు.
                       దేవుడు తన ఉన్నతమైన  ప్రేమను మనకు అనుగ్రహించును గాక.
                                                            ఆమెన్

No comments:

Post a Comment