Sunday, 11 May 2014

పాత నిబంధన గ్రంథములో ప్రస్తుతము 39 పుస్తకములు ఎలా ఏర్పడినవి?




పాత నిబంధన గ్రంథములో ప్రస్తుతము ఉన్న 39 పుస్తకములు 'కానోను'లోనే ఉన్నవి. పాత నిబంధన లేఖనములు యొక్క మూల ప్రతులు వ్రాయబడిన కాలమును పాత నిబంధన లేఖనముల యొక్క 'కానోను' అని యందురు. పాత నిబంధన గ్రంథములోని తొలి పుస్తకమైన 'ఆదికాండము' క్రీస్తు పూర్వము 1450వ సంవత్సరమున వ్రాయబడుట వలన ఆ సంవత్సరము 'కానోను' ప్రారంభించబడిన కాలముగా, చివరి పుస్తకమైన 'మలాకీ' క్రీస్తు పూర్వము 400వ సంవత్సరమున వ్రాయబడుట వలన ఆ సంవత్సరమును 'కానోను' ముగింపబడిన కాలముగా పరిగణిస్తున్నారు. అనగా క్రీస్తు పూర్వము 1450వ సంవత్సరము నుండి క్రీస్తు పూర్వము 400వ సంవత్సరము మధ్యనున్న కాలమును పాత నిబంధన గ్రంథము యొక్క 'కానోను' అని యందురు. 'కానోను' అను గ్రీకు పదమునకు 'కొలకఱ్ఱ' అని యర్థము. 'ప్రామాణికము' అను మరియొక అర్థము కూడా ఉన్నది. అనగా పాత నిబంధన లేఖనములు వ్రాయబడిన కాలమును ప్రామాణికముగా చేసుకొని వాటిని ఒక ఐక్య గ్రంథముగా పరిగణించుట వలన 'కానోను' అను పదమును ఉపయోగిస్తున్నారు.

కానోనులోని పుస్తకములే ఇప్పుడును ఉన్నవి

పాత నిబంధన గ్రంథములో ఇప్పుడున్న 39 పుస్తకములను క్రీస్తు పూర్వము 443వ సంవత్సరముల నాటికే 'కానోను'గా అంగీకరించడం జరిగినది. అయితే వాటిలో కొన్ని పుస్తకములను కలిపి ఒకే పుస్తకముగా పరిగణించడం వలన 'కానోను'లో ఇప్పుడున్న పుస్తకములు అప్పుడును ఉన్నప్పటికీ వాటి సంఖ్యలో మాత్రము మార్పులు కనిపించాయి. హెబ్రీ భాషలోని ఈ మూలప్రతులను క్రీస్తు పూర్వము మూడవ శతాబ్దములో గ్రీకు భాషాంతరము చేసేటప్పుడు కూడా అన్నిటినీ తర్జుమా చేయడం జరిగింది. ఈ లేఖన గ్రంథముల్లోని కొన్ని పుస్తకములను ఏక పుస్తకముగా చేర్చుట వలన పాత నిబంధన గ్రంథములోని పుస్తకముల సంఖ్య 24 అయ్యింది. అయితే ఆ తరువాత పుస్తకములను విభజించడం వలన వాటి సంఖ్య 39కి చేరుకుంది. ఈ సంఖ్య ఏర్పాటు ఎప్పుడు మరియు ఎవరి చేత నిర్ణయింపబడినో చెప్పుటకు స్పష్టమైన చారిత్రక ఆధారములు లేవు. అయితే క్రీస్తు శకము 100వ సంవత్సరములో యెరూషలేమునకు పడమరలోని జామ్నియాలో నున్న యూదు అధ్యాయన కేంద్రములో యూదు పండితులు సమావేశమయ్యేవారని, పాత నిబంధన గ్రంథములోని పుస్తకముల నిర్దుష్టత గురించి చర్చించుకొనేవారని చారిత్రక ఆధారాలు ద్వారా తెలియుచున్నది. దీనిని బట్టి పాత నిబంధన గ్రంథములో 39 పుస్తకములు ఉండాలన్న నిర్ణయము వీరిదే కావచ్చనే అభిప్రాయాలు ఉన్నవి. అయితే పాత నిబంధన గ్రంథములో ప్రసంగి, పరమగీతము, ఎస్తేరు గ్రంథముల చేర్పుపై విముఖత తెలియజేస్తూ క్రీస్తు శకము 200 సంవత్సరముల వరకు వివాదములు కొనసాగాయి. అయితే ఆ పుస్తకములు యధాతథముగా కొనసాగడంతో పాటు కొత్తగా ఎలాంటి పుస్తకములు చేరలేదు. అనగా హెబ్రీ మూల ప్రతుల నుంచి పాత నిబంధన కానోనులో ఎలాంటి మార్పులు జరగలేదని అర్థమగుచున్నది.
 

No comments:

Post a Comment