పాత నిబంధన గ్రంథము అనేది 39 పుస్తకముల సంకలనమని గత వ్యాసముల్లో చదివి యున్నాము. వాటిని ప్రధాన భాగాలుగా వర్గీకరించి యున్నారని కూడ తెలిసికొనియున్నాము. ఆ వర్గీకరణ గురించి బైబిలు నందు ప్రస్థావించబడియుండటం ఆసక్తికరమైన అంశము. క్రొత్త నిబంధన కాలములో యూదుల పవిత్ర లేఖనములను సాదృశ్యముగా చెప్పబడే సందర్భములో ఈ వర్గీకరణ గ్రంథముల ప్రస్థావన కనిపించును.
పంచకాండములు
* "వారు లేచెదరని మృతులను గూర్చిన సంగతి మోషే గ్రంథమందలి పొదను గురించిన భాగములో మీరు చదువలేదా? ఆ భాగములో దేవుడునేను అబ్రాహాము దేవుడను ఇస్సాకు దేవుడను యాకోబు దేవుడనని అతనితో చెప్పెను" మార్కు 12:26
పై లేఖనములో చెప్పబడిన "మోషే గ్రంథము" అనునది పాత నిబంధన గ్రంథములోని ప్రధాన మరియు ప్రథమ వర్గీకరణ. ఆదికాండము, నిర్గమ కాండము, లేవీయకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండము పుస్తకముల సంకలనమే మోషే గ్రంథము. వీటిని పంచ కాండములు అని కూడ అందురు. ప్రాచీన యూదులు "తోరా" అని పిలిచెదరు. దీనికి హెబ్రీ భాషయందు "బోధన" అని అర్థము. పై లేఖనములో మోషే గ్రంథమందు పొదను గురించిన భాగములో చెప్పబడినట్లు పేర్కొనిన విషయము నిర్గమకాండము గురించి ప్రస్థావించుచున్నది. దానికి నిదర్శనము క్రింద ఇవ్వబడియున్నది.
* "మరియు ఆయన-నేను నీ తండ్రి దేవుడను, అబ్రాహాము దేవుడను ఇస్సాకు దేవుడను యాకోబు దేవుడను అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవునివైపు చూడ వెరచెను". నిర్గమకాండము 3:6
ప్రవక్తల గ్రంథము
* "అందుకు దేవుడు వారికి విముఖుడై ఆకాశసైన్యమును సేవించుటకు వారిని విడిచిపెట్టెను. ఇందుకు ప్రమాణముగా ప్రవక్తల గ్రంథమందు ఈలాగు వ్రాయబడియున్నది.
-ఇశ్రాయేలు ఇంటివారలారా
మీరు అరణ్యములో నలువది యేండ్లు
బలి పశువులను అర్పణములను నాకు అర్పించితిరా?" అపో.కార్యములు 7:42
పై వచనములో పేర్కొనబడిన ప్రవక్తల గ్రంథము అనేది పాత నిబంధన గ్రంథమందు రెండవ వర్గీకరణ. యెహోషువ, న్యాయాధిపతులు, 1, 2 సమూయేలు (ఒకే గ్రంథము), 1, 2 రాజులు (ఒకే గ్రంథము), యెషయా, యిర్మీయా, యెహెజ్కేలు, 12 మంది చిన్న ప్రవక్తలుగా పిలువబడిన హోషేయ, యోవేలు, ఆమోసు, ఓబద్యా, యోనా, మీఖా, నహూము, హబక్కూకు, జెఫన్యా, హగ్గయి, జెకర్యా, మలాకీ రాసిన గ్రంథములు ఈ వర్గీకరణ కిందకు వస్తాయి. పై లేఖనములో పేర్కొనబడిన ప్రవక్తల గ్రంథము యొక్క భాగము ఆమోసు గ్రంథమును సూచించుచున్నది. అందుకు నిదర్శనము క్రింద ఇవ్వబడియున్నది.
* "ఇశ్రాయేలీయులారా, అరణ్యమందు నలువది సంవత్సరములు మీరు బలులను నైవేద్యములను నాకు అర్పించితిరా?" ఆమోసు 5:25
కీర్తనలు గ్రంథము
* "అంతట-మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములోను, కీర్తనలలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నియు నేరవేరవలెనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పెను" లూకా 24: 44
పై వచనములో పాత నిబంధన గ్రంథము యొక్క వర్గీకరణను స్పష్టము చేయుచున్నది. అందులో చెప్పబడిన మోషే ధర్మశాస్త్రము, ప్రవక్తల గ్రంథము, కీర్తనలులో ఇప్పటికే మొదటి రెండు వర్గీకరణ గురించి లేఖన రుజువులు పరిశీలించియున్నాము. మూడవదియైన కీర్తనల గ్రంథము గురించి పరిశీలిద్దాము. ఈ వర్గీకరణలో 1, 2 దినవృత్తాంతములు, ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరుతో పాటు కావ్య గ్రంథములుగా పిలువబడిన యోబు, కీర్తనలు, సామితెలు, ప్రసంగి, పరమగీతము, అలాగే రూతు, విలాపవాక్యములు, దానియేలు గ్రంథమును చేర్చిరి.

No comments:
Post a Comment