Sunday, 11 May 2014

క్రొత్త నిబంధన గ్రంథము రచయితల నిర్ధారణ




క్రొత్త నిబంధన గ్రంథములోని 27 పుస్తకములను ఎనిమిది మంది వ్రాశారని తెలిసికొనియున్నాము. ఈ పుస్తకములను మనం పేర్కొంటున్న గ్రంథకర్తలే వ్రాశారా? అని నిర్ధారించుకోవడానికి చారిత్రక మరియు బైబిలు వాక్యాల సాక్ష్యాలు సహాయపడుతున్నవి. ప్రస్తుతము మత్తయి సువార్త గ్రంథకర్త గురించి తెలుసుకొనెదము.

1. మత్తయి

క్రొత్త నిబంధన గ్రంథములోని తొలి పుస్తకం మత్తయి సువార్త. ఈ పుస్తకములో ప్రత్యక్షముగా చూడబడిన ఘటలనను అలాగే గ్రంథస్థము చేయడం వలన అందులో గ్రంథకర్త ఎవరనే విషయము గురించి ప్రత్యక్ష ప్రస్థావన కనిపించదు. అయితే చారిత్రక ఆధారములు మాత్రము మత్తయి సువార్త గ్రంథకర్తగా అపొస్తలుడైన మత్తయినే పేర్కొంటున్నాయి. హీరపొలిస్ బిషప్ పాపియస్ (క్రీస్తు శకము 70-155) మత్తయి సువార్త గ్రంథకర్తగా అపొస్తలుడైన మత్తయినే పేర్కొనియున్నాడు. అపొస్తలుడైన మత్తయితో ఇతనుకు ప్రత్యక్ష సంబంధం కలిగియున్నట్లు చరిత్ర చెబుతుంది. అప్పట్లో మత్తయి సువార్త గ్రంథకర్తగా ఎవరూ ముందుకు రాకపోవడం, దీనిపైన ఎలాంటి వాదనలు లేకపోవడంతో అపొస్తలుడైన మత్తయినే ఈ సువార్త గ్రంథకర్తగా తెలియుచున్నది. అలాగే మత్తయి సువార్తలోని ఘటనలు పోలి మార్కు, లూకా అనే మరో రెండు సువార్తలు కూడా క్రొత్త నిబంధన గ్రంథములో ఉన్నవి. వీటి గ్రంథకర్తలు వేర్వేరు వ్యక్తులు. ఈ మూడు సువార్తలలో మత్తయి గురించి చెప్పబడిన వచనముల మధ్య సారూప్యత గ్రహించడం ద్వారా మత్తయి సువార్త గ్రంథకర్తను గుర్తించవచ్చును.

* "యేసు అక్కడ నుండి వెళ్లుచు సుంకపు మెట్టునొద్ద కూర్చుండియున్న మత్తయి అను ఒక మనుష్యుని చూచి-నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా" మత్తయి 9:9

* "ఆయన మార్గమున వెళ్లుచు, సుంకపు మెట్టునొద్ద కూర్చున్న అల్ఫయి కుమారుడగు లేవిని చూచి-నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా" మార్కు 2:14

* "అటుపిమ్మట ఆయన బయలుదేరి, లేవి యను ఒక సుంకరి, సుంకపు మెట్టునొద్ద కూర్చుండియుండుట చూచి-నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా" లూకా 5:27

పైన పేర్కొనబడిన మూడు లేఖనములు కూడా మత్తయిని యేసు చూచిన సందర్భమును గురించి చెప్పుచున్నవి. ఈ మూడు వాక్యములు దాదాపు ఒకే విధముగా చెప్పుచున్నవి. అయితే మత్తయి పేరును మాత్రము వేర్వేరు విధాలుగా చెప్పబడినది. మత్తయి సువార్తలో మత్తయిగా చెప్పబడగా మార్కు మరియు లూకా సువార్తలో మాత్రము లేవిగా చెప్పబడినది. వాస్తవమునకు మత్తయి అసలు పేరు లేవికాగా యేసుని కలిసిన పిమ్మట ఆయన పేరు మత్తయిగా మార్చబడినది. ఈ పదమునకు హెబ్రీ భాషయందు 'దేవుని కానుక' అని అర్థము. మార్కు, లూకా సువార్తలలో మత్తయి పూర్వపు పేరును ప్రస్థావించగా గ్రంథకర్త కావడం వలననే మత్తయి మార్పుచెందిన తన పేరును అలాగే కొనసాగించినట్లు తెలియుచున్నది.

అలాగే

* "ఇంటిలో భోజనమునకు యేసు కూర్చుండియుండగా ఇదిగో సుంకరులును పాపులును అనేకులు వచ్చి ఆయన యొద్దను ఆయన శిష్యుల యొద్దను కూర్చుండిరి. మత్తయి 9:10

* "అతని యింట ఆయన భోజనమునకు కూర్చుండియుండగా, సుంకరులును పాపులును అనేకులు యేసుతోను ఆయన శిష్యులతోను కూర్చుండియుండిరి" మార్కు 2:15

* "ఆ లేవి తన యింట ఆయనకు గొప్ప విందు చేసెను. సుంకరులను ఇతరులు అనేకులును వారితో కూడ భోజనమునకు కూర్చుండిరి" లూకా 5:29

పైన పేర్కొనబడిన మూడు లేఖనములు కూడా సుంకరి ఇంటిలో యేసు భోజనము చేయు సందర్భము గురించి చెప్పుచున్నవి. ఈ మూడు వాక్యములు దాదాపు ఒకే విధముగా ఉన్నవి. అయితే మత్తయి సువార్తలో ఎవరి ఇంటిలో యేసు భోజనమునకు కూర్చుండి యున్నారనే విషయమును ప్రస్థావించలేదు. మార్కు సువార్తలో మాత్రము 'అతని యింట' అంటూ, లూకా సువార్తలో 'లేవి యింట' అంటూ ప్రస్థావించింది. గ్రంథకర్త అపొస్తలుడైన మత్తయి కావడం చేతనే తన ఇంటిని ప్రత్యేకించి ప్రస్థావించలేదని, అయితే మిగతా ఇద్దరు గ్రంథకర్తలు మాత్రము ఆ ఇల్లు లేవి (మత్తయి)కి చెందినదిగా ప్రస్థావించియున్నారని తెలియుచున్నది.

No comments:

Post a Comment