Sunday, 11 May 2014



క్రొత్త నిబంధన గ్రంథములోని పుస్తకముల సేకరణ ఎలా జరిగింది?

క్రొత్త నిబంధన గ్రంథము కోసమే ప్రత్యేకించి పుస్తకములను వ్రాయడం జరుగలేదు. యూదు లేఖనములు (పాత నిబంధన గ్రంథము) అందుబాటులో ఉండటంతో క్రొత్త నిబంధన గ్రంథము రూపకల్పన గురించి ఆలోచన ఎవరిలోను కలుగలేదు. అయితే యేసు మరణానంతరం ఆయన శిష్యులు (అపొస్తలలు) సువార్తను ప్రకటించడంలో భాగంగా వివిధ సంఘాలను ఉద్దేశిస్తూ పత్రికలు వ్రాశారు. 2 పేతురు 3:14 వాక్యము పరిశీలించినట్లయితే ఈ విషయము అవగతమగును. ఆ పత్రికలను ఆ సంఘంలోని సోదరులకు చదివి వినిపించేవారు. 1 థెస్సలొనీకయులకు 5:27వ వాక్యము ఈ విషయమును నిర్ధారించును. కాలక్రమములో అపొస్తలలు ఒక్కొక్కరిగా మరణించడంతో యేసును ప్రత్యక్షముగా చూచినవారి (అపొస్తలలు) నుంచి ప్రత్యక్షముగా సువార్తను వినగలిగే అవకాశం సంఘాలకు, సోదరులకు లేకుండా పోయింది. అయితే ఆ కొరత తెలియకుండా ఉండేందుకుగానూ ఇతర సంఘాల వద్దనున్న అపొస్తలుల పత్రికల్లోని విషయాలను సేకరించాలనే ఆసక్తి మిగతా సంఘాలకు ఏర్పడింది. దీంతో ఇతర సంఘాల్లో ఉన్న అపొస్తలలు పత్రిక ప్రతులను తెప్పించుకొని వాటిని తమ సంఘాల్లో చదివించుకున్నారు. కొలొస్సయులకు 4:16 వాక్యమును పరిశీలిస్తే ఈ విషయము అర్థమగును. ఆ విధముగా ఇతర సంఘాల నుంచి వచ్చిన అపొస్తలలు పత్రికలను నకళ్లు వ్రాయించుకొని తమ వద్ద ఉంచుకున్నారు. ఈ విధముగా అపొస్తలలు కొన్ని సంఘాలకు వ్రాసిన వివిధ పత్రికలు అన్ని సంఘాల వారికి చేరినవి. అప్పటికే క్రీస్తు జీవిత చరిత్ర, బోధనలు కూడా వ్రాయబడి ఉండటంతో వాటిని కూడా పలు సంఘాలు సేకరించుకొని సంఘ సభ్యులకు చదివి వినిపించేవి. ఆ విధముగా కొత్త నిబంధన గ్రంథములోని పుస్తకముల సేకరణ జరిగి ప్రత్యేక గ్రంథములుగా వాడుకలోకి వచ్చాయి. కొన్నాళ్లకు ఆ గ్రంథములను సంకలనము చేయడంతో క్రొత్త నిబంధన గ్రంథముగా రూపాంతరం చెందింది.

No comments:

Post a Comment