Sunday, 11 May 2014

యూదు లేఖనములు అనగా ఏమి?




బైబిలునందు పాత నిబంధన గ్రంథములోని పుస్తకములనే యూదు లేఖనములు అని అందురు. వీటిని యూదు పవిత్ర లేఖనములు అనియు, యూదు గ్రంథములనియు కూడ పిలిచెదరు. ఇవి యూదుల చరిత్రను తెలియజేసే మరియు యూదుల చేత వ్రాయబడిన లేఖనములు కావడంతో వాటిని యూదు లేఖనములుగా పిలుచుచున్నారు.

యూదు లేఖనములకు ప్రాధాన్యత ఎందుకు?

యాకోబునకు ఇశ్రాయేలు అను మరియొక పేరు ఉండటం చేత ఆయన సంతతిని ఇశ్రాయేలీయులు అని అందురు. ఇశ్రాయేలీయుల యొక్క స్వంత దేవుడు గురించి మరియు వారికి దేవుడు నిర్దేశించిన జీవన విధానము గురించి పాత నిబంధన గ్రంథము తెలియజేయుచున్నది. యాకోబు యొక్క 12 మంది కుమారుల్లో నాలుగవ వాడైన యూదా సంతతివారే యూదా గోత్రీకులు. అనగా ఇశ్రాయేలీయులల్లో ఒక గోత్రము వారే యూదులు. ఈ యూదులు తమ పితరుల చరిత్రతో పాటు తమ గోత్రములో పుట్టనున్న మెస్సియా గురించిన ప్రవచనములను గ్రంథస్థము చేయడం వలన యూదు లేఖనములకు అత్యంత ప్రాధాన్యత ఏర్పడినవి.

యూదు లేఖనములు ఎప్పుడు వ్ర్రాయబడినవి?

పాత నిబంధన గ్రంథములోని పుస్తకములు క్రీస్తు పూర్వము 1450వ సంవత్సరము నుంచి క్రీస్తు పూర్వము 400 సంవత్సరముల మధ్యకాలములో వ్రాయబడినవి. ఇవన్నియు ఇశ్రాయేలీయులు చదివి, విని వాటిలో పలు పుస్తకములను వ్రాయబడిన కాలములోనే అంగీకరించడం జరిగినది. అటువంటివే మోషేగారి చేత వ్రాయబడినట్లు భావిస్తున్న పంచకాండములు. పంచకాండములుగా పిలువబడుచున్న ఆదికాండము, నిర్గమకాండము, లేవీయకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండము పుస్తకముల సంకలనమే యూదుల పవిత్ర గ్రంథమైన 'తోరా'. ఈ పదము హెబ్రీ భాషయందు 'బోధన' అనే అర్థమునిచ్చుచున్నది. పాత నిబంధనలోని మిగిలిన పుస్తకములను తరువాతి కాలములో వాటి శ్రేష్ఠతను గ్రహించి అంగీకరించడం జరిగినది.

యూదు లేఖనముల సేకరణ ఎప్పుడు జరిగినది?

యూదు లేఖనముల సేకరణ క్రీస్తు పూర్వము 400వ సంవత్సరము నుంచి ప్రారంభమైనది. యూదు లేఖనముల్లో కొన్ని క్రీస్తు పూర్వము 1300 కాలము నాటివి. సుమారు 200 సంవత్సరముల పాటు యూదు లేఖనముల సేకరణ జరిగినది. అయితే ఏయే గ్రంథములు యూదు లేఖనములుగా నిర్ధారించాలి అనే విషయములో మాత్రము సందిగ్ధత కొనసాగినది. క్రీస్తు శకము 110వ సంవత్సరము వరకు కూడ యూదు లేఖనముల నిర్ధారణ జరుగలేదు. యూదు లేఖనముల సేకరణ, నిర్ధారణ పనులను యూదు బోధకులైన రబ్బీలు చేపట్టారు.

No comments:

Post a Comment