క్రొత్త నిబంధన గ్రంథములోని మూడో పుస్తకము లూకా సువార్త. ఇది తొలి రెండు పుస్తకముల వలే యేసు యొక్క జీవిత చరిత్రను, ఆయన బోధనలను వెల్లడించుచున్నది. తొలి రెండు పుస్తకముల తరహాలోనే ఈ పుస్తకములో కూడా సంఘటనలకు ప్రాధాన్యత కల్పిస్తూ రచనలు చేయడం వలన గ్రంథకర్త ఎవరనే విషయము గురించి ఈ సువార్త యందు ఎలాంటి ఆధారములు కనిపించవు. అయితే ప్రాచీన చారిత్రక ఆధారములను బట్టి లూకా సువార్త గ్రంథకర్త అపొస్తలులతో ప్రత్యక్ష సంబంధాలు కలిగినట్లు బైబిలు నందు చెప్పబడిన లూకాగానే తెలియుచున్నది.
చారిత్రక ఆధారములు:
లూకా సువార్త గ్రంథకర్త నిర్ధారణ నిమిత్తము క్రీస్తు శకము రెండో శతాబ్ధము తొలి అర్థ భాగము నుంచే పలు అనుమానాలు ఉన్నవి. బ్యాసిలెడీస్, మార్సియన్ అనేవారు లూకా సువార్త విశ్వసనీయత మీద, గ్రంథకర్త విశ్వసనీయత మీద అనుమానములు లెవనెత్తిరి. అయినను ఈ సువార్త గ్రంథకర్త లూకాగానే పలువురు విశ్వసించారు. టాటియన్ (క్రీస్తు శకము 160) అనే పరిశోధకుడు కూడా లూకా సువార్త గ్రంథకర్తగా లూకానే పేర్కొనియున్నారు. క్రొత్త నిబంధన గ్రంథములోని తొలి నాలుగు పుస్తకములైన మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలను కూలంకుషంగా పరిశోధించి ఆయన ఈ విషయమును తన పుస్తకమైన డైయటెస్సరన్ లో వెల్లడించియుండెను. అలాగే మ్యూరటోరి అనే పండితుడు కనుగొన్న క్రీస్తుశకము 170వ సంవత్సరమునాటి శాసనములోను లూకా సువార్తను గురించి స్పష్టముగా పేర్కొనబడినది. దీనిని బట్టి చారిత్రక ఆధారముల ద్వారా లూకా సువార్త గ్రంథకర్త లూకా అనే విషయము నిర్ధారింపబడుతున్నది.
రెండు గ్రంథముల రచయిత:
లూకా సువార్త మరియు అపొస్తలుల కార్యముల రచనా శైలి ఒకే విధముగా కనిపించడంతో రెండు పుస్తకములకు ఒక్కరే గ్రంథకర్తగా భావించుచున్నరు. లూకా సువార్త, అపొస్తలుల కార్యములు రెండు పుస్తకముల ఆరంభ తీరును పరిశీలించినట్లయితే థెయొఫిలాను ఉద్దేశిస్తూ వ్రాయబడియున్నది. అలాగే ఆ రెండు వాక్యముల ద్వారా రెండిటి గ్రంథకర్త ఒక్కరే అని చెప్పుటకు బలమైన మరో ఆధారము ఉన్నది.
* "ఘనత వహించిన థెయొఫిలా, ఆరంభము నుండి కన్నులారా చూచి వాక్య సేవకులైనవారు మనకు అప్పగించిన ప్రకారము మన మధ్యను నెరవేరిన కార్యములను గూర్చి వివరముగా వ్రాయుటకు అనేకులు పూనుకొన్నారు గనుక నీకు ఉపదేశించబడిన సంగతులు నిశ్చయముగా జరిగినవని పరిష్కారముగా తెలిసికొనియున్న నేనును నీ పేరట వాటిని గూర్చి వరుసగా రచించుట యుక్తమని యెంచితిని" లూకా 1:1-4
లూకా సువార్తలోని ప్రారంభమును పరిశీలించినట్లయితే "నేనును నీ పేరట వాటిని గూర్చి వరుసగా రచించుట యుక్తమని యెంచితిని" అనే వచనము ద్వారా లూకా సువార్తతో పాటు కొనసాగింపుగా రచన చేయాలని లూకా నిర్ణయించినట్లు స్పష్టముగా తెలియుచున్నది. అపొస్తలుల కార్యములు పుస్తకమును పరిశీలించినట్లయితే లూకా కొనసాగింపుగా రచించిన పుస్తకము అదేననే విషయము అవగతమగును. అది ఎలాగో చూసెదము.
* "ఓ థెయొఫిలా, యేసు తాను ఏర్పరచుకొనిన అపొస్తలులకు పరిశుద్ధాత్మ ద్వారా, ఆజ్ఞాపించిన తరువాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటినన్నిటిని గూర్చి నా మొదటి గ్రంథమును రచించితిని" అపొస్తలుల కార్యములు 1:1-2
అపొస్తలుల కార్యములోని పై పుస్తకములో తాను మొదటి గ్రంథమును రచించినట్లు గ్రంథకర్త స్పష్టముగా తెలిపియుండెను. లూకా సువార్త గ్రంథకర్తవలే అపొస్తలుల కార్యముల గ్రంథకర్త కూడా థెయొఫిలాను ఉద్దేశిస్తూ రచన ప్రారంభించడంతో లూకా సువార్త మరియు అపొస్తలుల సువార్త గ్రంథకర్త ఒక్కరే అని తెలియుచున్నది.
బైబిలు ద్వారా లూకా చరిత్ర:
క్రొత్త నిబంధన గ్రంథమందు మూడు చోట్ల మాత్రమే లూకా ప్రస్థావన కనిపించును. లూకా వైద్యుడని (కొలస్సయులకు 4:14), ఆయన సువార్త పరిచర్యలో అపొస్తలుడైన పౌలుకు జతపనివానిగా ఉన్నాడని (2 తిమోతి 4:11, ఫిలేమోనుకు 1:24) తెలియుచున్నది. లూకా వ్రాయబడినట్లు విశ్వసిస్తున్న అపొస్తలుల కార్యములు పుస్తకములో పౌలు ప్రయాణ సందర్భములో "మమ్ము", "మేము" అనే వచనముల ద్వారా సువార్త ప్రకటనలో భాగముగా ఆయన పౌలు వెంట పలు ప్రాంతములకు పర్యటించినట్లు తెలుసుకోగలము. అపొస్తలుల కార్యములు 16:10-11, 17:1 ద్వారా పౌలుతో పాటు లూకా ఫిలిప్పీకి, థెస్సలొనీకు ప్రయాణము చేశారని తెలియుచున్నది. మొదటి చెరకాలములో పౌలుతో ఉన్న కొందరిలో లూకా కూడా ఒకరు కాగా (కొలొస్సయులు 4:14), రెండవ చెర కాలములో పౌలుతో లూకా మాత్రమే ఉండెను (2 తిమోతి 4:11). లూకా జన్మస్థలము గురించి బైబిలునందు ప్రస్థావింపబడలేదు. అయితే యూసిబియస్ జేరోముకు సంఘ పెద్దలు వ్రాసిన పత్రికలో లూకా అంతియొకయుడని వ్రాసిరి.
No comments:
Post a Comment