Sunday, 11 May 2014

యోహాను సువార్త గ్రంథకర్త ఎవరు?



క్రొత్త నిబంధన గ్రంథములోని నాలుగవ పుస్తకము యోహాను సువార్త. తొలి మూడు పుస్తకముల వలే ఇది కూడా యేసు జీవిత చరిత్ర, బోధనలకు ప్రాధాన్యత కల్పిస్తూ రచన చేసి యుండుట వలన గ్రంథకర్త ఎవరనే విషయమును గురించి ప్రస్థావన కనిపించదు. దీంతో బైబిలులోని కొన్ని వాక్యములను ఆధారముగా చేసుకొని ఈ పుస్తకము యొక్క గ్రంథకర్తగా వేర్వేరు వ్యక్తులను సూచించియున్నారు. అయితే ఈ పుస్తకమును అపొస్తలుడైన యోహాను వ్రాసినట్లు పూర్వపు కాలము నుండి గట్టిగా విశ్వసింపబడుతుంది.

చారిత్రక ఆధారములు:

యోహాను సువార్తను అపొస్తలుడైన యోహాను వ్రాసియున్నట్లు క్రీస్తు శకము 150-200వ సంవత్సరముల మధ్యకాలములో పలువురు బలముగా విశ్వసించుచున్నట్లు చారిత్రక ఆధారములు ఉన్నవి. దీని ద్వారా అంతకు కొన్ని దశాబ్ధముల ముందు నుంచే యోహాను సువార్త వాడుకలో ఉండవచ్చని తెలియుచున్నది. క్రీస్తు శకము 170వ సంవత్సరమునకు చెందిన మ్యూరిటోరియం శాసనము సైతము యోహాను సువార్త యొక్క గ్రంథకర్తను యోహానుగానే స్పష్టము చేయుచున్నది. యోహాను యొక్క స్నేహితుడగు పాలికార్పునకు శిష్యుడు, ఒక సంఘ పిత్రుడైన ఐరేనియస్ కూడా యోహాను సువార్త గ్రంథకర్తగా యోహానునే విశ్వసించియుండెను. ఈ విషయమును 177వ సంవత్సరమందు తన గురువైన పాలికార్పు గురించి ఆయన వ్రాసియున్న ఒక లేఖ ద్వారా తెలియుచున్నది. అయితే పలువురు బైబిలు లేఖన పరిశోధకులు మాత్రము ఈ గ్రంథకర్త విషయమై విభిన్న అభిప్రాయములను వెల్లడించియున్నారు.

బైబిలు ఆధారములు:

"పేతురు వెనుకకు తిరిగి, యేసు ప్రేమించిన వాడును, భోజన పంక్తిని ఆయన రొమ్మున ఆనుకొని-ప్రభువా, నిన్ను అప్పగించువాడెవడని అడిగిన వాడునైన శిష్యుడు తమవెంట వచ్చుట చూచెను. పేతురు అతనిని చూచి-ప్రభువా, యితని సంగతి ఏమగునని యేసును అడిగెను. యేసు-నేను వచ్చువరకు అతడుండుట నాకిష్టమైతే అది నీకేమి? నీవు నన్ను వెంబడించు మనెను. కాబట్టి ఆ శిష్యుడు చావడను మాట సహోదరులలో ప్రచురమాయెను. అయితే చావడని యేసు అతనితో చెప్పలేదు గాని-నేను వచ్చువరకు అతడుండుట నాకిష్టమైతే అది నీకేమని చెప్పెను. ఈ సంగతులను గూర్చి సాక్ష్యమిచ్చుచు ఇవి వ్రాసిన శిష్యుడు ఇతడే; ఇతని సాక్ష్యము సత్యమని యెరుగుదుము" యోహాను 21:20-24

పై వాక్యమును పరిశీలించినట్లయితే యేసు ప్రేమించిన శిష్యుడి గురించి పేతురు ప్రశ్నించినట్లు కనిపించడంతో పాటు ఆ శిష్యుడే ప్రస్తుత యోహాను సువార్తలోని సంగతులను గూర్చి వ్రాసియుండెనను అర్థమును కూడా ఇచ్చుచున్నది. దీని ద్వారా యేసు శిష్యులలో ఒకరు యోహాను సువార్తను వ్రాసియుండెరని చెప్పుటలో ఎలాంటి సందేహము లేదు. ఆ శిష్యుడు ఎవరనే విషయమును "యేసు ప్రేమించిన" శిష్యుడిగా సూచింపబడియున్నది. అయితే బైబిలు నందు యేసు ప్రేమింపబడిన శిష్యుడు అని పలుమార్లు పేర్కొనబడినప్పటికీ (యోహాను 19:26,27) అతను ఎవరనే విషయమును మాత్రము ఏ సందర్భములోనూ స్పష్టముగా పేర్కొనబడలేదు.

యేసుకి అతి సన్నిహితులైన శిష్యులలో ఒకరు ప్రేమింపబడియుండాలి. ఈ నిమిత్తము లేఖనములను పరిశీలించినట్లయితే పేతురు, యోహాను, యాకోబు (లూకా 8:51, 9:28) పేర్లు కనిపించును. ఈ ముగ్గురిని యెరుషలేము చర్చి స్తంబములు అపొస్తలుడైన పౌలు సైతము తన పత్రికలో (గలతీయులకు 2:9) పేర్కొనియుండెను. "స్తంబములుగా ఎంచబడిన యాకోబు కేఫా యోహాను" అని ఆ పత్రికలో వారి గురించి ప్రస్థావించబడెను. పేతురు అనబడిన సీమోనుకు కేఫా అనే పేరును యేసు పెట్టియుండెను (యోహాను 1:40-42). దీని ద్వారా ఈ ముగ్గురిలో ఒక్కరు యేసుకు ప్రియ శిష్యుడని గ్రహించవచ్చును.

ఆ ఒక్క ప్రియ శిష్యుడు?

పేతురు, యోహాను, యాకోబు అను ముగ్గురు శిష్యులలో యేసు ప్రేమించే శిష్యుడు పేతురు కాదనే విషయాన్ని పలు సందర్భములలోని లేఖనముల ద్వారా గ్రహింపవచ్చును. అయితే యోహాను సువార్తలో యేసుతో పాటు ఆయన ప్రేమించిన శిష్యుడు వచ్చుచున్నట్లు పేతురు చూచుటను (21:20) లేఖనము తెలియజేస్తున్నది. అలాగే పలు సందర్భముల్లో సైతము పేతురు యుండగానే మరియొకరిని యేసు ప్రేమింపబడిన శిష్యుడిగా (యోహాను సువార్త 13:23-24, 20:2, 21:7) లేఖనములు పేర్కొనడం జరిగినది. అనగా పేతురు మరియు యేసు ప్రేమింపబడిన శిష్యుడు దాదాపు ఒక్కటిగానే ఉండేవారని తెలియుచున్నది. అలాగే పేతురుతో యోహాను మాత్రమే జంటగా కనిపించిన సందర్భాలను కూడా (లూకా 22:7, అపొస్తలుల కార్యములు 3:1, 11, 4:7, 13, 8:14, 17) లేఖనములు ప్రస్థావించుచున్నవి. వీటి ఆధారముగా పేతురు ఉన్న సందర్భాల్లో చెప్పబడిన యేసు ప్రేమింపబడిన శిష్యుడు యోహాను మాత్రమే అని , ఈ యోహాను జెబెదయి కుమారుడు (మార్కు 3:17) అని విశ్వసించుచున్నారు.

విభిన్న అభిప్రాయములు:

యోహాను సువార్తను యేసు ప్రేమింపబడె శిష్యుడు వ్రాసియున్నాడని లేఖన అర్థమునిచ్చుచుండటంతో ఈ శిష్యుడు ఎవరనే విషయమై కూడా విభిన్న అభిప్రాయాలు నెలకొన్నాయి. పలు సందర్భాల్లో కొందరిని యేసు ప్రేమింపబడినవారిగా సూచించడమే ఇందుకు కారణము. వారిలో లాజరు, మగ్దలేనే మరియ, యేసు తమ్ముడు యూదా తదితరులు ఉన్నారు. వారి ప్రస్థావన ఎందుకు వస్తుందో కూడా తెలుసుకొనెదము.

లాజరు మరియు మార్త?

"యేసు మార్తను ఆమె సహోదరిని లాజరును ప్రేమించెను" యోహాను 11:5

పై వాక్యము ద్వారా యేసు ప్రేమింపబడిన వారుగా మార్త మరియు ఆమె సహోదరుడు లాజరును చెప్పబడినది. అందువలన యోహాను సువార్తను వీరిద్దరిలో ఎవరైన ఒకరు వ్రాసియుండవచ్చనే వాదన కూడా బయలుదేరింది. కొందరైతే మార్తా వ్రాసినదని, మరికొందరైతే లాజరు వ్రాసియున్నాడని పూర్వకాలములో వాదించియున్నారు. యోహాను 11:3లో "ప్రభువా, యిదిగో నీవు ప్రేమించువాడు" అంటూ లాజరు గురించి చెప్పబడుట వలన లాజరు వ్రాసియున్నాడని వాదించిరి.

మగ్దలేనే మరియ?

యోహాను సువార్తలో యేసు ప్రేమించిన శిష్యుడిగా పేర్కొనబడిన రెండు సందర్భముల్లోనూ (యోహాను 19:25-27, 20:1-11) మగ్దలేనే మరియ ప్రస్థావన కూడా కనిపించును. అందువల్ల యోహాను సువార్త గ్రంథకర్త మగ్దలేనే మరియగా చెప్పబడే వర్గము కూడా బయలుదేరింది. అయితే అది కూడా కేవలం ఊహాజనిగము కావడం గమనించవలసిన విషయము.

యేసు తమ్ముడు?

"యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి-అమ్మా, యిదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూచి-యిదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియనుండి ఆ శిష్యుడు ఆమెను తన యింట చేర్చుకొనెను" యోహాను 19:26-27

పై వాక్యములో యేసు తన తల్లికి తన ప్రియశిష్యుడిని కుమారునిగా చూపించడం జరిగింది. అయితే యేసుకు యాకోబు, యోసే, యూదా, సీమోను అను సహోదరులు (మార్కు 6:3) ఉన్నారు. అనగా యేసు తన ఒంటరి కాదు. అయినప్పటికీ మరియొకరికి తన తల్లి బాద్యతలను యేసు అప్పగించగలరా?. ఈ విషయమును ప్రశ్నిస్తూ యేసు ప్రేమించే శిష్యుడు అతని సోదరుడైన యాకోబు లేదా యూదాగా ఉండొచ్చని భావించుచున్నారు. అయితే యోహాను సువార్త గ్రంథకర్త గురించి చెప్పిన ఏ వాదనలు కూడా కాలం చక్రములో నిలువలేదు. యోహాను సువార్తను యేసు ప్రేమించిన శిష్యుడు వ్రాసియుండెనని లేఖనము ద్వారా చెప్పబడుచుండగా పైన అభిప్రాయపడుచున్న ఎవరినీ కూడా శిష్యులుగా లేఖనాలు స్పష్టము చేయబడకపోవడమే అందుకు కారణము.

No comments:

Post a Comment