Sunday, 11 May 2014

క్రొత్త నిబంధన పుస్తకములను ఎందుకు వ్రాయబడినవి?




పాత నిబంధన లేఖనములు వాడుకలో ఉండగానే క్రొత్త నిబంధన పుస్తకములు ఎందుకు వ్రాయబడినవి? అనే మీమాంస రావడం కద్దూ. దీనిపై స్పష్టత కొరకు పాత నిబంధన లేఖనములు వ్రాయుటకు దారితీయబడిన కారణములను ఒక్కసారి పరిశీలిద్దాము. భూమ్యాకాశముల సృష్టి మొదలుకొని మోషే కాలము వరకు భూతకాల చరిత్రను మోషే గ్రంథస్థము చేయగా ఆ తరువాతి సంఘటనలు ఆయా కాలాలకు చెందినవారు గ్రంథస్థము చేశారు. అలాగే వాగ్ధాన దేశమైన కనాను, బబులోను నాశనము, లోక రక్షకుడిగా యేసు జన్మించడం తదితర భవిష్యత్తుకాల విషయములను ముందుగానే గ్రంథస్థము చేసినారు. దీనిని బట్టి ఒక నిర్దేశిత మార్గంలో కొనసాగుతున్న చరిత్రలోని భూత, వర్తమాన, భవిష్యత్తు కాలాలకు సంబంధించిన కీలక ఘట్టాలను పదిలం చేసి భవిష్యత్తు తరాలకు అందించడమే లేఖనాల యొక్క ముఖ్యోద్దేశముగా కనిపించుచున్నది. పాత నిబంధన లేఖనముల్లో ఎన్నో కీలక సంఘటనలను ప్రస్థావించినప్పటికీ వాటి గమ్యం మాత్రము యేసు వద్దకు చేరునట్లు కనిపించును. అనగా పదిలం చేయబడుతున్న చరిత్రలో యేసు చరిత్ర కూడా ఒక కీలక ఘట్టంగా తెలియుచున్నది. అందువలననే ఆయన చరిత్రను, బోధనలను కూడా గ్రంథస్థము చేయడం జరిగినది.

సువార్త ప్రకటించడం కోసమే యేసు జీవిత చరిత్ర వాడుక

యేసు పునరుత్థానము జరిగిన తరువాత చాలా కాలము వరకు ఆయన జీవిత చరిత్ర మరియు ఆయన బోధనలను రచించలేదు. అందుకు ప్రధాన కారణం, "మరియు-మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి" (మార్కు 16:15-16) అని యేసు ఉద్బోదించడంతో సువార్తను ప్రకటించడమే తమ పూర్తిస్థాయి విధిగా ఆయన శిష్యులు భావించారు. అందుకే యేసు జీవిత చరిత్రను, ఆయన బోధనలను, మరణము, పునరుత్థానము గురించి ప్రచారం చేస్తూ సువార్తను ప్రకటించారు తప్పితే వాటిని గ్రంథస్థము చేయలేదు. అందువలన యేసు జీవిత చరిత్ర చాలా కాలం పాటు మౌఖికంగానే కొనసాగాయి. ఆ తరువాత సువార్తను ప్రకటించడం కోసం యేసు జీవిత చరిత్రను, ఆయన బోధనలు గ్రంథస్థము చేయాలని అపొస్తలలు భావించియుండవచ్చును. అపొస్తలుల కార్యములు 2:41, 6:7 వాక్యములు పరిశీలించినట్లయితే సువార్త ప్రకటించడం కోసమే యేసు జీవిత చరిత్ర, బోధనలు గ్రంథస్థము చేశారని, వాటిని అంగీకరించి పలువురు బాప్తిస్మము పొందారని తెలియును. ఇలా వ్రాయబడిన సువార్తలతో పాటు పలు సంఘాలకు వ్రాయబడిన పత్రికలు కూడా సంకలనము చేసి క్రొత్త నిబంధన గ్రంథముగా కూర్చబడినది.
 

No comments:

Post a Comment