Sunday, 11 May 2014

క్రొత్త నిబంధన గ్రంథములోని పుస్తకముల నిర్ధారణ ఎలా జరిగినది?










యేసు మరణాంతరము అపొస్తలలు వ్రాసిన యేసు జీవిత చరిత్ర మరియు ఆయన బోధనలు, పలు సంఘాలను ఉద్దేశిస్తూ అపొస్తలలు వ్రాసిన పత్రికలు ఆధారముగా క్రొత్త నిబంధన గ్రంథము రూపుదిద్దుకున్నదని తెలుసుకొని యున్నాము. అయితే ఈ పుస్తకములన్నీ వెంటనే అంగీకరింపబడలేదు. వాటికి గుర్తింపు లభించి క్రొత్త నిబంధన గ్రంథములో అంతర్భాగమై స్థిరత్వము నిలుపుకోడానికి చాలా ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యాయి. అపొస్తలులు వ్రాతలకు సంఘాల్లో బోధన హోదా కల్పించేందుకు అపొస్తలలుతో ప్రత్యక్ష సంబంధాలు కలిగిన అప్పటి మత పెద్దలు కృషి చేశారు. వారిలో ప్రముఖముగా రోమా పోప్ క్లెమెంట్ (క్రీస్తు శకము 95వ సంవత్సరము) ఒకరు. ఇతను గురించి క్రొత్త నిబంధన గ్రంథములో పేర్కొనబడినది. ఫిలిప్పీయులకు 4:3వ వాక్యములో 'క్లెమెంతు' అని చెప్పబడిన పేరు రోమా పోప్ క్లెమెంట్ గూర్చినదే. అలాగే అపొస్తలుడైన యెహాను శిష్యుడు మరియు అంతియోక బిషప్ ఇగ్నేషియస్ (క్రీస్తు శకము 115), క్రీస్తు శకము 100-165 మధ్యకాలములో నివశించిన జస్టిన్ మార్టర్ అనువారు కూడా ముఖ్యులు. క్రొత్త నిబంధన గ్రంథములోని తొలి నాలుగు పుస్తకములకు 'సువార్తలు' అను పేరు స్థిరపడుటకు కారణము జస్టిన్ మార్టర్. అలాగే అపొస్తలలు పుస్తకములకు గుర్తింపు లేకుండా చేయాలని ప్రయత్నించినవారిలో బాసిలెడీస్ (క్రీస్తు శకము 120), మార్సియోన్ (క్రీస్తు శకము 140) ప్రధానులు. వీరు తమ తమ కాలాల్లో అపొస్తలలు వ్రాతలు (ప్రస్తుత క్రొత్త నిబంధన గ్రంథములోని రచనలు) యోగ్యత మీద పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ తద్వారా అపొస్తలలు వ్రాతలకు సంఘాల్లో బోదించుటకు యోగ్యత లేనివిగా చూపించేందుకు ప్రయత్నించారు.

27 పుస్తకములు

క్రొత్త నిబంధన గ్రంథములోని పుస్తకముల సంఖ్యను ప్రప్రథమముగా ఎప్పుడు నిర్దేశించారో కచ్చితముగా చెప్పుటకు సరైన ఆధారములు లేవు. అయితే క్రీస్తు శకము 170 సంవత్సరమునకు చెందిన ఒక శాసనాన్ని క్రీస్తు శకము 1740వ సంవత్సరములో మ్యూరిటోరి అనే ఒక పండితుడు కనుగొన్నాడు. ఆ శాసనములో క్రొత నిబంధన గ్రంథములో 27 పుస్తకముల జాబితా ఉన్నట్లు కనబడుచున్నది. అయితే ఆ జాబితాలో హెబ్రీయులు, యాకోబు, 1,2 పేతురు, 3 యోహాను లేవు. వాటికి బదులుగా ఆ జాబితాలో వేరే పుస్తకముల పేర్లు లిఖింపబడియున్నాయి. దీని ద్వారా క్రీస్తు శకము 170వ సంవత్సరములో మత్తయి, మార్కు, లూకా, యోహాను అను నాలుగు సువార్తలు, అపొస్తలుల కార్యములు, పౌలు పత్రికలు, 1, 2 యోహాను, ప్రకటనల గ్రంథముకు అప్పటి సంఘాల నుంచి మద్దతు లభించినట్లు గ్రహించగలము. వాస్తవమునకు కీస్తు శకము 95-170 మధ్యకాలములో ప్రకటనల గ్రంథమును పలువురు అంగీకరించినప్పటికీ ఆ తరువాత దాని గ్రంథకర్త విషయము, అందులోని విషయమునకు వ్యతిరేకత కారణంగా ఆ గ్రంథమును తిరస్కరించబడినది. క్రీస్తు శకము 170-220 మధ్య కాలములో 2 పేతురు, 2, 3 యోహాను, యాకోబు, యూదా గ్రంథముల యోగ్యత మీద కూడా పలు అనుమానములు నెలకొన్నవి. అలాగే క్రీస్తు శకము 220-397 మధ్యకాలములో 2 పేతురు, 2, 3 యోహాను, యాకోబు, యూదా గ్రంథము, ప్రకటనల గ్రంథము యొక్క యోగ్యత మీద మత పెద్దలలో భిన్న అభిప్రాయాలు కొనసాగాయి. అయితే క్రీస్తు శకము 364వ సంవత్సరమున లవొదికయలో సంఘ రాయబారులు కూడి పలు హేతువు, ప్రతి హేతువులను పరిశీలించి చివరకు 27 పుస్తకములను అంగీకరించియున్నారు. చివరకు అలెగ్జాండ్రియా యొక్క 20వ బిషప్ అతనేషియస్ (క్రీస్తు శకము 367) క్రొత్త నిబంధన గ్రంథములోని పుస్తకముల సంఖ్యను 27గా నిర్ధారించాడు. ఈ జాబితాకు దేనిని కలుపకూడదని, ఈ జాబితాలో నుంచి దేనిని తీసివేయకూడదని ఆజ్ఞాపించారు. క్రీస్తు శకము 383వ సంవత్సరము వల్గేట్ అను లాటిన్ భాషాంతరములను చేసినప్పుడు 27 పుస్తకములను తర్జుమా చేసి క్రొత్త నిబంధన గ్రంథముగా రూపొందించియున్నారు. అలాగే క్రీస్తు శకము 397వ సంవత్సరము కార్తేజిలోని సంఘ పెద్దలు కూడి హేతువు, ప్రతి హేతువులను పరిపూర్ణముగా పరిశీలించి 27 పుస్తకములను ఆమోదించియున్నారు. ఇలా పలు సందర్భాల్లో అపొస్తలుల వ్రాతలు ఆశ్చర్యకరరీతిలో పరిరక్షింపబడుతూ వచ్చాయి

No comments:

Post a Comment